రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
రాగం: హిందోళ
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాళం:
పల్లవి
ఘనుడాతడే మము గాచుగాక హరి
అనిశము నేమిక నతనికె శరణు ॥ (2)
చరణం 1
యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు
యెవ్వడు రక్షకుడిన్నిటికి । (2)
యెవ్వని మూలము యీ సచరాచర
మవ్వల నివ్వల నతనికే శరణు ॥ (2)
ఘనుడాతడే మము గాచుగాక హరి.. (ప..)
చరణం 2
పురుషోత్తముడని పొగడి రెవ్వరిని
కరి నెవ్వడు గ్రగన గాచె । (2)
ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె
అరుదుగ మేమిక నతనికె శరణు ॥ (2)
ఘనుడాతడే మము గాచుగాక హరి.. (ప..)
చరణం 3
శ్రీసతి యెవ్వని జేరి వురమునను
భాసిల్లె నెవ్వడు పరమంబై । (2)
దాసుల కొరకై తగు శ్రీవేంకటము
ఆస చూపి నితడతనికె శరణు ॥ (2)
ఘనుడాతడే మము గాచుగాక హరి
అనిశము నేమిక నతనికె శరణు ॥ (ప..)