View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

వేంగామంబ గారి మంగళ హారతి

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకూ
పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృంగారవన పంక్తులకునూ
మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకరతోరణములకునూ
బహువిధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

దర చక్ర ముఖ్య సాధనములకు, మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ
కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళ మూర్తికి (9)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు, బలమొప్పునమిత ప్రభావమునకునూ
వలగొనిన సకలపరివార దేవతలకును, చెలగి పనులొనరించు సేవకులకూ (10)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ
పొలుపొందు విశ్వప్రభుత్వుల్లంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12)

జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ వేంకటేశ్వర శరణం మమ ॥

Browse Related Categories: