రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా
రాగం: యదుకులకాంభోజి ఆ: స రి2 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స తాళం: మిశ్రచాపు పల్లవి ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా .. చరణం 1 భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 2 శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 3 లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 4 సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 5 కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 6 మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 7 అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 8 భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 9 చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 10 గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 11 వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 12 సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 13 ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 14 కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥
Browse Related Categories: